Sunday, December 5, 2021

Chandrababu House : చంద్రబాబుకి వాన కష్టాలు.. ఇంటిని చుట్టుముట్టిన వరద, నీట మునిగిన పరిసరాలు | Flood Water Arrives At Chandrababu House In Naravaripalli


మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుని కూడా వాన కష్టాలు వదల్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంటిని భారీ వరద ముంచెత్తింది. ఇంటి వెనుక పొలాలపై నుంచి..

Chandrababu House : మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుని కూడా వాన కష్టాలు వదల్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంటిని భారీ వరద ముంచెత్తింది. ఇంటి వెనుక పొలాలపై నుంచి వచ్చిన వరద నీరు చుట్టుముట్టడంతో చంద్రబాబు ఇంటి పరిసరాలు నీట మునిగాయి. భద్రతా సిబ్బంది గదితో పాటు ఉద్యానవనం మునిగిపోయింది.

గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోక పోవడంతో సర్పంచ్ లక్ష్మీ భర్త గిరినాయుడు, చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడు సాయంతో నీరు బయటకు పంపిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో పడుతున్న వానలు చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా టీటీడీ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి.

ఇకపై రేప్ చేస్తే అది లేకుండా చేస్తారు.. రేపిస్టులు భయపడేలా కొత్త చట్టం

వర్షం కారణంగా శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని టీటీడీ తీసుకుంది. గురువారం, శుక్రవారం, శనివారం దర్శన అవకాశం కల్పించిన టీటీడీ.. టిక్కెట్లు ఉన్నా రాలేకపోయిన భక్తులు….తరువాత రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కుండపోత వానలతో కళ్యాణి డ్యామ్ పూర్తిగా నిండింది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

తిరుపతి నగరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా వరదనీరే కనిపిస్తోంది. అలిపిరిలోనూ వరద పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో తిరుపతి నగరం అంధకారంలో మునిగిపోయింది. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. రోడ్లపై ప్రవహిస్తున్న వరదకు కార్లు, బైకులు మునిగిపోయాయి.

తిరుపతిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు చెప్పారు. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని స్పష్టం చేశారు. తిరుపతి నుంచి నెల్లూరు, చెన్నై వైపు వెళ్లేవారు పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, తడ మీదుగా వెళ్లాలని సూచించారు. తిరుపతి నుంచి కడప వైపు వెళ్లేవారు 150 బైపాస్, పూతలపట్టు, పీలేరు, రాయచోటి మీదుగా వెళ్లాలని తెలిపారు.

Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

కాగా, భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు సాయం కోసం 0877-2256766 నెంబరును సంప్రదించాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అటు, తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండచరియలు విరిగిపడడంతో కనుమదారులను మూసివేసింది టీటీడీ.

అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఏపీలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరు ప్రకాశం, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Latest Articles