Saturday, November 27, 2021

Pawan Kalyan : చంద్రబాబు కంటతడి పెట్టడం బాధించింది, మహిళలను కించపరచొద్దు | Pawan Kalyan Reaction On Chandrababu Tears


తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని పవన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆవేదన కలిగిస్తున్నాయని..

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తన భార్యను అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ లో భోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని పవన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆవేదన కలిగిస్తున్నాయని పవన్ అన్నారు.

Read More..Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

ఓవైపు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తుంటే అవేమీ పట్టని ప్రజాప్రతినిధులు ఆమోదయోగ్యం కాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పవన్ విమర్శించారు. ఇటీవల కాలంలో సభలు, సమావేశాలు, ఆఖరికి టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. తాజాగా శాసనసభలో గౌరవనీయ విపక్ష నేత కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయం అని పవన్ వాపోయారు.

గతంలో సీఎం జగన్ కుటుంబ సభ్యులను కూడా కొందరు తక్కువ చేసి మాట్లాడినప్పుడు తాను ఇలాగే ఖండించానని పవన్ స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అర్ధాంగిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నానని అన్నారు.

Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని హితవు పలికారు పవన్. మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ధోరణులను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, లేకపోతే ఒక అంటువ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని పవన్ హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Latest Articles